విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం

Posted by Srikanth on January 31st, 2010

Requested by Sudhakar

విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓం..
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం…
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ……ఆ…..
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది (2)
నే పాడిన జీవన వేదం ఈ గీతం..
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన | ప్రాగ్దిశ |
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారముకాగా
విశ్వకార్యమునకిది భాష్యముగా || విరించినై ||

జనించు ప్రతిశిశుగళమున పలికిన జీవననాద తరంగం
చేతనపొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం | జనించు |
అనాది రాగం ఆదితాళమున అనంత జీవనవాహినిగా
సాగిన సృష్టి విలాసమునే || విరించినై ||
నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం (2)
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన వేదం ఈ గీతం…

Movie :Sirivennela

Comments are closed.